తాజాగా బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చి.. కాంగ్రెస్ గూటికి చేరుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటా, బయటా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంజయ్.. చివరకు జగిత్యాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. దీంతో రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా సంజయ్ కుమార్ పరిస్థితి తయారయింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న డాక్టర్ సంజయ్ విషయాన్ని జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. స్థానిక నేతలను సంప్రదించకుండానే ఆయనను పార్టీలో చేర్చుకోవడంతో అక్కడ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎదుర్కొన్న కేసులను ఇంకా తామంతా మరచిపోలేదని అంటున్నారు. అప్పుడు తమను ముప్పు తిప్పలు పెట్టడానికి కారణమైన అదే ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం సరైన నిర్ణయం కాదని జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
అంతేకాదు సంజయ్ చేరిక నచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా తన పదవికి రాజీనామా చేయడానికే సిద్ధమవడం హాట్ టాపిక్ అయింది. దీంతో డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ.. జగిత్యాల ద్వితీయ శ్రేణి లీడర్స్‌తో కలిసి పనిచేసే అవకాశముంటుందా అన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన లీడర్ షిప్‌లో పార్టీలో కొనసాగడానికి ఆసక్తి చూపిస్తారా లేక.. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారా అన్నదే ఇప్పుడు అనుమానంగా ఉంది.
ఇటు దశాబ్దానికి పైగా అనుబంధం ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో సంజయ్‌కి అనుకూలంగా ఉండే సెకండ్ క్యాడర్ మాత్రం లేకుండా పోయిందనే చెప్పొచ్చు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని.. తనతో కలిసి కాంగ్రెస్ లోకి రావాలని డాక్టర్ సంజయ్ నుంచి ఆహ్వానాలు అందుతున్నా కూడా ఎవరూ అతనితో కలిసి నడవడానికి ఇష్టపడటం లేదట.ఇటు కాంగ్రెస్ నేతలు అక్కున చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు.. అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెనక్కి వెళ్లలేని పరిస్థితులు ఉండటంతో సంజయ్ తొందరపడ్డారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE