తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో భూకంపం గురించి వస్తున్న కథనాలు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. రామగుండం కేంద్రంగా భూమి గట్టిగా కంపించే అవకాశం ఉందని .. ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు వ్యాపించవచ్చనే ఊహాగానాలతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది.
తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే ఒక సంస్థ ..రామగుండం ప్రాంతంలోని భూగర్భంలో ఏదో కదలిక జరుగుతోందని, దీనివల్ల భారీ భూకంపం సంభవించవచ్చని వారు అంచనా వేసింది. ఈ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలతో పాటు.. సుదూర ప్రాంతమైన అమరావతిని కూడా ప్రభావితం చేయగలవని చెప్పింది.అయితే ఈ ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ సూచనలను మాత్రం ప్రభుత్వ వర్గాలు కానీ, పేరుమోసిన శాస్త్రీయ సంస్థలు కానీ ఎవరూ ఇంతవరకు ధృవీకరించలేదు. భూకంపాల సమయాన్ని, తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడం ఇప్పటికీ సాధ్యం కాదు కాబట్టి ఎవరూ దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు.
నిజానికి భూమి పొరల నిర్మాణం ప్రకారం.. పసిఫిక్ జోన్ రెండవ, మూడవ ప్రాంతాలలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ జోన్లు సాధారణంగా తక్కువ నుంచి మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే సూచిస్తాయి. ఇంతకుముందు ఇక్కడ చిన్న చిన్న భూకంపాలు వచ్చినా కూడా.. అవి ఎలాంటి పెద్ద నష్టాన్ని కలిగించలేదు. రామగుండం ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నా, దీనికి అధికారికంగా ఎలాంటి బలమైన ఆధారం లేదు. భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరమే కానీ, నిర్ధారణ లేని సమాచారంపై అనవసరంగా భయపడాల్సిన పని లేదని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇదివరకు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిన సందర్భాలు ఉన్నా, భారీ భూకంపాల చరిత్ర అంతగా లేదు. 1969లో ప్రకాశం జిల్లాలో 5.1 తీవ్రతతో ఒకసారి భూకంపం రాగా.. 1998లో ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. హైదరాబాద్‌లో కూడా కొన్నిసార్లు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చినా, వాటి వల్ల ఎలాంటి నష్టమూ జరగలేదు. చివరకు శ్రీశైలం డ్యామ్ ప్రాంతంలో కూడా భూమి కదిలినట్లు రికార్డులలో ఉన్నాయి.