తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్‌లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్‌కు ఒకే మార్కులు, మరో వరుసలో 702 మంది అభ్యర్థులకి ఒకే మార్కులు రావడం సంచలనం రేపింది. ఈ అసాధారణ ఫలితాలు పరీక్షల మూల్యాంకనంలో పారదర్శకత లోపించిందని, టెక్నికల్ అయినా లేదంటే కావాలనే చేశారనే అనుమానాలకు దారితీశాయి.

తెలంగాణలో 2024 అక్టోబర్‌లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ ఎగ్జామ్స్‌లో 563 పోస్టుల కోసం 31వేల383 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే, ఫలితాల్లో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయని, ఇది ఇండియాలోనే అతిపెద్ద పరీక్షా కుంభకోణం అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ రిజల్ట్ 2025 ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్‌లోని కొన్ని ఎగ్జామ్ సెంటర్ల నుంచి అసాధారణ సంఖ్యలో టాపర్‌లు రావడం మరో వివాదాస్పద అంశం అయింది. కేవలం ఓ రెండు కేంద్రాల నుంచే 74 మంది టాపర్‌లు రావడం, 15 కేంద్రాల నుంచి అన్ని ర్యాంకులు రావడం అనుమానాలను రేకెత్తించాయి.

563 పోస్టుల్లో టాప్ 500 ర్యాంకుల్లో ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ కూడా చోటు సంపాదించలేదని బీఆర్ఎస్ నాయకుల ఆరోపిస్తున్నారు. ఇది పేపర్లు దిద్దే సమయంలో పక్షపాతం ఉందనే అనుమానాలను బలపరుస్తుందని అంటున్నారు.ఈ ఫలితాలను దేశ చరిత్రలోనే అతిపెద్ద పరీక్షా కుంభకోణం అని ఆరోపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ఈ ఫలితాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే, వారు వెంటనే ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు సపోర్ట్ ఇవ్వాలని సవాలు విసిరారు.

మూల్యాంకనంలో మూడోదశ తనిఖీ జరగలేదని, రెండో దశ మూల్యాంకనం కాంట్రాక్ట్ సిబ్బంది చేతిలో జరిగిందని అలాగే, ప్రొఫెసర్‌లు లేదా శాశ్వత సిబ్బంది చేయాల్సిన పనిని అనధికార వ్యక్తులకు అప్పగించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ముందుగానే పరీక్షలకు సంబంధించిన డేటా లీక్ అయినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో వందలాది గ్రూప్-1 అభ్యర్థులు నిరసనలు చేపట్టి.. ఈ ఫలితాలను రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులను నిర్బంధించి, వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడంతో.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.