ఎస్ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు

ఎస్ఎల్బీసీ టన్నెల్‌ పైకప్పు కూలిపోయిన ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులైంది. టన్నెల్‌లో 8 మంది చిక్కుకుపోగా.. 15 రోజుల తర్వాత ఒకరి మృతదేహాం మాత్రమే లభ్యమైంది. మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతోనే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నిమిషానికి 5 వేల లీటర్ల నీరు ఊరుతుండటంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అయిపోతుంది.
హైలైట్:

ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల ప్రాతంలో .. టన్నెల్‌లో పని చేయడానికి మెుత్తం 40 మంది కార్మికులు లోపలికి వెళ్లగా.. అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ సమయంలో బయటకు పరుగులు తీసిన 32 మంది ప్రాణాలతో బయటపడగా… 8 మంది సిబ్బంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్, సింగరేణి, హైడ్రాతో పాటు దేశంలోని అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నా ఫలితం మాత్రం శూన్యం.

సుమారు 15 రోజుల తర్వాత కేరళ కేడావర్ డాగ్స్ స్క్వాడ్ సహాయంతో.. అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరపగా.. టన్నెల్ బోర్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. మిగిలిన ఏడుగురి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి . ఈ టన్నెల్ ప్రమాదం దేశంలోనే చాలా అరుదైనదని నిపుణులు అంటున్నారు. టన్నెల్ మెుత్తం పొడవు 14 కిలోమీటర్లు కాగా.. 13.85 కి.మీటర్ల దగ్గర పైకప్పు కూలిపోయింది.దీంతో మట్టి, రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, నీరు,బురద, టీబీఎం శిథిలాలు 11వ కిలోమీటరు నుంచి 13.85 కి.మీటర్ల వరకు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. నిమిషానికి దాదాపు 5 వేల లీటర్ల నీరు ఊరుతుండటంతో మట్టి గట్టిగా మారుతుంది.దీనికితోడు సహాయక చర్యలు జరుగుతున్న టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉండటంతో జాగ్రత్తగా పనులు కొనసాగిస్తున్నారు.

దేశంలోని ది బెస్ట్ అన్న పేరు బడ్డ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు సుమారు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నా.. సహాయక చర్యల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రస్తుతం టీబీఎం యంత్రాన్ని కట్ చేసి మిగిలిన ఏడుమంది ఆచూకి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అందులో చిక్కుపోకుపోయిన ఏడుగురు బతికుండే అవకాశం లేకపోయినా..వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలి కాబట్టే ఈ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.