బహుజన విధానంతో ముందుకెళ్తూ, సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే, బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన పాటుపడుతుందన్నారు. జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవాలు హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర పార్టీ నాయకులు,పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో జనసైనికులకు తెలంగాణ బీజేపీ గౌరవం ఇచ్చే అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన నాయకులకు గౌరవంలేని చోట స్నేహంచేయండని చెప్పే ధైర్యం నాకులేదు: పవన్
“రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇవ్వడంతో మద్దతు ప్రకటించాను. బీజేపీ కేంద్ర నాయకత్వానికి మనం అన్నా, మన పార్టీ అన్నా చాలా గౌరవం. మన బలాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తులు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు, జనసైనికులు అండగా నిలబడిన విధానం చూసి స్వయంగా కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ప్రత్యేకించి ప్రశంసించారు. కానీ దురదృష్టం, బాధ కలిగించే అంశం ఏమిటంటే స్థానికంగా ఉండే బీజేపీ నాయకత్వం దానిని గుర్తించడానికి సిద్ధంగా లేదు. పైగా జనసైనికులు, ఆడపడుచులను చులకన చేసేలా మాట్లాడం మనస్తాపం కలిగించిదని కొందరు ఆడపడుచులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్న జనసైనికులకు గౌరవం ఇవ్వకపోవడంతో వారు బాధపడటాన్ని అర్ధం చేసుకున్నాను. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను నెట్టను. ఆడబిడ్డలకు, జనసైనికులు, జనసేన నాయకులకు గౌరవం లేని చోట స్నేహం చేయండి అని చెప్పే ధైర్యం నాకు లేదు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ పీవీ నరసింహారావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కుమార్తె వాణీ దేవికి మద్దతు ఇస్తామని తెలంగాణ విభాగం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, వారి ఇష్టాలను గౌరవించాలి తప్ప నా ఇష్టాలను బలవంతంగా రుద్దలేను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ