జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి షేక్‌పేటలో రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్, “మీ ఉత్సాహం చూస్తుంటే బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చకపోతే నేతలను గల్లాపట్టి నిలదీస్తామని హెచ్చరించారు. వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్, ఆడబిడ్డలకు రూ.2,500 ఇచ్చే హామీలను గుర్తు చేస్తూ “ఒక్కరికి అయినా ఈ డబ్బులు అందాయా?” అని ప్రజలను ప్రశ్నించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలైన రాష్ట్రం నుంచి నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కరెంటు లేక ఇబ్బందులు పడిన రోజులు గుర్తున్నాయా? నేడు 24 గంటల కరెంటు అందిస్తున్నది కేసీఆర్ పాలన ఫలితం” అన్నారు. పల్లెలు, పట్టణాలు రెండింటినీ సమానంగా అభివృద్ధి చేసిన ప్రభుత్వంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వివరించారు. “ఒకప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్, మేము దానిని రూ.2,000కి పెంచాం. ప్రతి వర్గాన్నీ కేసీఆర్ ఆదుకున్నారు” అని గుర్తుచేశారు.
అలాగే, నగర అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పాలనలో నిర్మించిన ఫ్లైఓవర్లు, గురుకుల పాఠశాలలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వివరించారు. “హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టించాం, కానీ రేవంత్ రెడ్డి రెండు ఏళ్లలో వేలాది పేదల ఇళ్లు కూల్చేశాడు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?” అని కేటీఆర్ విమర్శించారు.
“కేసీఆర్ నీళ్లు ఉచితంగా ఇచ్చారు, కాంగ్రెస్ బిల్లులు వేస్తోంది. వృద్ధులు, మహిళలు, రైతులు అందరూ మోసపోయారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయడం అంటే హామీలకు గుడ్‌బై చెప్పినట్టే” అని కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ డిపాజిట్ జప్తు చేయాలని పిలుపునిచ్చారు.





































