ఖమ్మంలో కల్వకుంట్ల కవిత నిరవధిక దీక్ష, అరెస్ట్

K.Kavitha Begins Indefinite Hunger Strike in Khammam After Police Detention

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితుల పక్షాన పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫిబ్రవరి చివరలో వెలుగుమట్ల గ్రామంలోని వినోబా నగర్ కాలనీలో ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు అండగా నిలిచిన కవిత, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ప్రకటించారు.

హైటెన్షన్ – జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన

సోమవారం మధ్యాహ్నం అంబేడ్కర్ భవన్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు బాధితులతో కలిసి కవిత భారీ ర్యాలీ నిర్వహించారు.

  • భైఠాయింపు: అంబేడ్కర్ విగ్రహం వద్ద దాదాపు రెండు గంటల పాటు బాధితులతో కలిసి ఆమె రోడ్డుపైనే బైఠాయించారు. దీనివల్ల ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

  • బలవంతపు అరెస్ట్: పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా పోలీసులు లేకుండానే తనను వాహనంలోకి ఎక్కించడంపై కవిత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది చట్టవిరుద్ధమని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు.

  • డిమాండ్లు: కూల్చివేసిన చోటే బాధితులకు కొత్త ఇళ్లు కట్టించాలని, కలెక్టర్ స్వయంగా వచ్చి బాధితుల గోడు వినాలని ఆమె డిమాండ్ చేశారు.

నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

సాయంత్రం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన వెంటనే కవిత వెనక్కి తగ్గకుండా, నేరుగా అంబేడ్కర్ భవన్‌కు చేరుకుని తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు.

  • దీక్షా పర్వం: బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచే బాధితులతో కలిసి ఆమె దీక్షకు కూర్చున్నారు.

  • ప్రభుత్వంపై విమర్శలు: పేదల ఇళ్లను కూల్చివేసి ఆ విలువైన 30 ఎకరాల భూమిని ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై బుల్‌డోజర్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.

  • ఈ క్రమంలో తాజాగా పోలీసులు కవిత దీక్షను భగ్నం చేసి మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
నేపథ్యం – వెలుగుమట్ల వివాదం

ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూములలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఫిబ్రవరిలో అధికారులు అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేశారు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో ఈ సమస్య రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here