
తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్.. ప్రతిపక్షనాయకుడిగా ప్రజాసమస్యలపై మళ్లీ ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. కొంతకాలం స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర, సభల ద్వారా నిత్యం ప్రజల్లో తిరిగారు. బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. పోలింగ్ అనంతరం తమ పార్టీ ఏకంగా 12, 13 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవ్వగానే.. కేసీఆర్ ఉద్యమాలకు పిలుపునివ్వడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ప్రచార సమయంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ.. మళ్లీ ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని ప్రకటించారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన వెంటనే రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. “రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించింద”న్నారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది.” అని కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలని… రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్అధినేత పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. పోలింగ్ ముగిసిన మూడో రోజే.. ఉద్యమాలకు కేసీఆర్ పిలుపు ఇవ్వడం ద్వారా.. మున్ముందు కాంగ్రెస్ సర్కారుపై పోరుకు సిద్ధమయ్యారన్న సంకేతాలు ఇచ్చారు. ఈక్రమంలో ప్రతిపక్ష పార్టీగా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు గులాబీ పార్టీ సిద్ధమైందని తెలుస్తోంది. ఇక మున్ముందు తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY