
ప్రతిపక్ష పార్టీ నేతగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో సమరశంఖం పూరించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికలు ముగిశాక కూడా సర్కారుపై సమరం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ ఎస్ శ్రేణులు రైతుల పక్షాన రోడ్లపై పోరాడుతున్నారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ” అంటూ తనదైన శైలిలో విమర్శలధాటి మొదలుపెట్టిన కేసీఆర్.. ఇప్పుడు యుద్ధం ఇంకా మిగిలే ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ యుద్ధంలో అందరినీ కలుపుకుని పోవాలని కేసీఆర్ భావిస్తున్న ఆయన చేసిన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్.. రెండు దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను సైతం పట్టించుకోలేదన్న అపవాదు మూటగట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విషయమై కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓరకంగా అది ఫలితాలపై ప్రభావం చూపింది కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడానికి అదీ ఓ కారణంగా ఆ పార్టీ నేతలే అంగీకరించారు. ఈక్రమంలో ఆ అపవాదు పోగొట్టుకునేందుకు తాజాగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉద్ధృతమైందన్నారు. మరోసారి కవులు, కళాకారులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనదిశగా తీసుకెళుతోందన్నారు. కర్షకులు, కార్మికులు, నిరుద్యోగులు వివిధ వర్గాలు కాంగ్రెస్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలకు చిన్న ఇబ్బంది కలగకుండా పాలన చేశామన్నారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో కేసీఆర్ అన్ని వర్గాలనూ కలుపుకుని సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY