హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్కామ్ వెలుగు చూసింది. అక్రమ విల్లాల వ్యాపారం నిర్వహించి వందల కోట్ల మోసం చేసిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండిగల్ పోలీసుల దర్యాప్తులో రూ.400 కోట్లకు పైగా విల్లా స్కామ్ జరిగినట్లు తేలింది.
325 అక్రమ విల్లాలు – అనుమతులు కేవలం 65కే!
గుర్రం విజయలక్ష్మి (48), నిజాంపేట బాలాజీ నగర్ వాసి, శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్ & భావన జీఎల్‌సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థలు ప్రారంభించి, 2018లో మల్లంపేటలో విల్లాలను నిర్మించడం ప్రారంభించింది. మొత్తం 325 విల్లాలను నిర్మించగా, వాటిలో కేవలం 65 విల్లాలకు మాత్రమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అనుమతులు ఉన్నాయి. మిగతా 260 విల్లాలను గ్రామ పంచాయతీ అనుమతులతో అమ్మకాలు చేపట్టింది.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి
2021-2024 మధ్య విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో 7 కేసులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ విచారణ అనంతరం 201 విల్లాలను సీజ్ చేసినా, తన రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉపయోగించి వాటిని తిరిగి రిజిస్టర్ చేయించుకుంది. బాధితుల ఫిర్యాదుతో 2024 సెప్టెంబర్ 29న సెక్షన్ 318(4), 318(2), 316(2), రెడ్ విత్ 2(5)బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది.
తనపై లుక్‌అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అమెరికాకు పారిపోవాలని ప్రయత్నించిన విజయలక్ష్మిని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో లుక్‌అవుట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించడంతో, ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
విజయలక్ష్మి నిర్మించిన 26 విల్లాలు స్థానిక కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయి. అక్టోబర్ 2024లో హైడ్రా అధికారులు 15 విల్లాలను కూల్చివేశారు. విల్లాలను ప్రీమియం సదుపాయాలతో అందిస్తామని చెప్పి, కనీసం డ్రైనేజ్, నీటి సదుపాయం కూడా కల్పించకపోవడం బాధితులను అసంతృప్తికి గురి చేసింది. విజయలక్ష్మి అరెస్టు వార్త తెలియగానే, మల్లంపేటలో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు దుండిగల్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆమెపై నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ పోలీసులకు సంతకాలతో వినతిపత్రం సమర్పించారు.
రియల్ ఎస్టేట్ స్కామ్‌లకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందా? గుర్రం విజయలక్ష్మి కేసు తర్వాత ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా? అనేది చూడాలి!