తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రజా పాలన ప్రభుత్వం వారికి తీపి కబురు అందించింది. 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2.1 శాతం కరువు భత్యం (DA) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపుతో గతంలో 50.7 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 52.8 శాతానికి చేరుకుంది. జనవరి 1, 2026 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని, దీనివల్ల వేలాది మంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
డీఏ పెంపు వివరాలు
గత ఏడాది జూలైలో 2.1 శాతం డీఏ పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో పెంపును ప్రకటించింది. ఈ తాజా నిర్ణయం వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా సుమారు రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ, కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న మూడు నెలల బకాయిలను రాబోయే మూడు నెలల్లో ఒక్కో నెల విడతగా సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నారు.
ఆర్టీసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఈ సందర్భంగా నిర్వహించిన రీజియన్ మేనేజర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీని తెలంగాణ ప్రజల ‘లైఫ్ లైన్’గా అభివర్ణించారు. కేవలం జీతాల పెంపుదలకే పరిమితం కాకుండా, సంస్థలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు, మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
ఆర్టీసీలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వివరించారు. కారుణ్య నియామకాలు చేపట్టడం, గతంలో వివిధ కారణాలతో తొలగించబడిన ఉద్యోగులను త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆర్టీసీ ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్ ద్వారా సిబ్బందికి మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. మే 2024లో ఆర్‌పీఎస్(RPS)-2017 అమలు తర్వాత ప్రస్తుతానికి ఉద్యోగులకు ఎలాంటి డీఏ బకాయిలు లేవని అధికారులు స్పష్టం చేశారు.







































