తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

New Ration Cards In Telangana Is Your Name On The List

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఆలస్యం చేయకుండా అర్హులందరికీ వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ, ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి తక్షణ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా వారికి అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు.

సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలించగా, వెంటనే కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై చర్చ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. నూతన దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించడంతో, మీ-సేవా కేంద్రాల వద్ద ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు.

ప్రజాపాలన లేదా ప్రజావాణి సమయంలో దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారి దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల నిరుపేద కుటుంబాలను కొత్త రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించింది. ఈ జాబితాలో మొత్తం 11,65,052 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అభ్యంతరాలను స్వీకరించేందుకు జనవరి 20 నుంచి 24 వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించగా, జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.