తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణాయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరించబోతోంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో తెలంగాణలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి, అలాగే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించడానికి సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో మంగళవారం పలు శాఖలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ కీలక ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా సచివాలయంలో ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు సంబంధించి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై రేవంత్ సమీక్షించారు.
ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే స్పీడ్ అంటే.. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఉద్ధేశం. రేవంత్ రెడ్డి సమీక్షలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. భూబదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా ఆస్పత్రి నిర్మించాలని సీఎం చెప్పారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా సూచించారు. వీటన్నిటితో పాటు గోషామహల్ పోలీస్ అకాడమీకి.. ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..5వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేస్తోంది. మరికొన్నింటిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీని అధికారులు పూర్తి చేశారు.
ఇదిలా ఉండగానే ..మరోసారి ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డు దరఖాస్తులను స్వీకరించడానికి రేవంత్ సర్కార్ సన్నాహాలను ప్రారంభించింది. దీనిలో రేషన్ కార్డు, హెల్త్ కార్డు లేని వారి నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో 9 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు.
మరి ఇన్నేళ్ల విరామం తర్వాత చాలా మందికి పెళ్లిళ్లు అవ్వడం, పిల్లల సంఖ్య పెరగడం, మార్పులు చేర్పులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను రిలీజ్ చేస్తుందనేది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.