జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు స్టార్ క్యాంపయినర్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ రాష్ట్ర పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలు ప్రచార కార్యక్రమాలు, పార్టీ కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో ప్రచార వ్యూహాలు, ఎన్నికల హామీలు, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాంచీలోని జేకే హాల్ లో సంవాద్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఝార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ కూటమి వ్యూహం.. విడుదల చేయాల్సిన మేనిఫెస్టో పై కూడా చర్చించారు.
కార్యకర్తలందరూ సమన్వయంగా పని చేస్తే.. మనం ఝార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ మౌళిక సూత్రాలను కాపాడటంతో పాటు దేశ వనరులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశం నానాటికి వెనక్కి వెళుతుందని విమర్శించారు. దళిత, బలహీన వర్గాలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. మరోవైపు
దేశంలో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ కేసీ వేణుగోపాల్ విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు. కేరళ నుంచి శ్రీనగర్ వరకు మొక్కవోని దీక్షతో పర్యటిస్తున్నారని, దీపావళి పండుగరోజు తెలంగాణలో సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మనమంతా గెలిచినట్టేనని, ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు ఇతర అనుబంధ విభాగాలను తక్షణమే సమావేశపరచి ఎన్నికల్లో నిమగ్నం అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.