రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి . రైతుల ముసుగులో అధికారులపై దాడులు జరిపే ప్రయత్నం చెయ్యడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. లగచర్ల సంఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, అధికారులపై దాడులు జరగడం మనమీద మనం దాడి చేసుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు.
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్‌పై హత్యాయత్నం జరిగిన విషయంపై స్పందిస్తూ, ఈ సంఘటన వల్ల రేపు ప్రజలపై లేదా రాజకీయ నాయకులపై దాడులు జరగొచ్చని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. కొంతమంది గులాబీ గూండాలు రైతుల ముసుగులో శాంతి భద్రతలను కలుగజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, అధికారులను రైతులకు దూరం చేయడం కొంతమంది చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు.
అధికారులను రక్షించలేకపోతే, పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఖమ్మంలో మిర్చి రైతులను జైల్లో పెట్టడం, మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించడం, సిరిసిల్లలో దళితులకు బేడీలు వేయడం వంటి ఘటనలను మంత్రి గుర్తు చేశారు.