హైదరాబాద్ వాసులకు వాన అలెర్ట్

నెల రోజుల ముందు నుంచీ భానుడు ఉగర్రూపం చూపిస్తున్న సమయంలో.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ..ఈరోజు కూడా అంటే మార్చి 23న కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కి.మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లో వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తరు వాన‌లు కురిసే అవ‌కాశమున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మొన్నటి వ‌ర‌కు ఎండ‌ల‌తో ఠారెత్తిపోయిన గ్రేటర్‌ వాసులు ద్రోణి ప్రభావంతో.. కొంత ఉపశమనం పొందారు. వానల ప్రభావంతో ఉష్టోగ్రతలు కూడా తగ్గాయి.

శ‌నివారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు హైదరాబాద్‌లో 34.6 డిగ్రీల గ‌రిష్ఠ ఉష్ణోగ్రత‌, 19.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత‌లు నమోదవగా.. గాలిలో తేమ 48 శాతంగా న‌మోదైన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చెబుతోంది. ఇక తెలంగాణలో ఈరోజు గరిష్టంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. వర్షాల వల్ల ఈ రోజు, రేపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని.. ఆ తరువాత నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మరోవైపు ఏపీలో ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు, పిడుగులు పడుతున్నాయి. దీంతో ఏపీ వాసులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని దీనివల్ల.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్ క్రింద, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. అయితే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.