ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అవకముందే భానుడు భగభగమండిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. మార్చిలోనూ అదే రేంజ్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినా.. ద్రోణి ప్రభావంతో అప్పుడప్పుడు వర్షాలు పడటంతో కాస్త కూల్ అయ్యారు.
అకాల వర్షానికి రైతులు నష్టపోయినా, అంతవరకూ ఉక్కబోత, ఎండలతో అల్లాడిన ప్రజలు మాత్రం కాస్త కుదట పడ్డారు. మళ్లీ వారం రోజులుగా ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ అధికారులు మరోసారి కూడా చల్లటి కబురు అందించారు. రాగల మూడు,నాలుగు రోజులలో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం, బుధవారం, గురువారం,శుక్రవారం తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
మంగళ, బుధ,గురువారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెబుతూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసారు.
దక్షిణ బంగాళా ఖాతం మధ్య ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలో, ఆ తరువాత ఉత్తర దిశగా కదిలి, తరువాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతోనే తెలంగాణలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.