తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాంగ్రెపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు కావటం లేదని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందని.. దోపిడి పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అసత్యాలు, నెరవేర్చనవిగా పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను తీవ్రంగా మోసం చెయ్యటమే అని దుయ్యబట్టారు.
కాగా ప్రధాని మోడీ కామెంట్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ప్రజలకు తాము ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే విషయంలో నిబద్ధతతో ఉన్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తమదే రికార్డు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ నిన్న చేసిన విమర్శలపై ఇవాళ ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు అవాస్తవాలని ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి బీఆర్ఎస్ హయాంలో నెలకొన్న చీకటి, నిరాశను పారదోలుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఉదయిస్తున్న సూర్యుడిలా వెలుగుతోందన్నారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన రెండురోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ. 500 రూపాయలకే సిలిండర్ లభిస్తుంది. 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ లబ్ధి జరిగింది. 42,90,246 మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. గ్రూప్ – 1, 2, 3, 4 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన11 నెలల్లోపే భర్తీ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 మంది అర్హతగల యువతకు ఉద్యోగాలు కల్పించింది. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలు 40 శాతానికి పైగా పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.