తెలంగాణలో మార్చి 31 వరకు పథకాల జాతర..

Schemes Bonanza in Telangana Until March 31

తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు .. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 6 లక్షల 87వేల 677 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా 563 గ్రామాల్లో జరిగింది. రైతులు, కూలీలు, గూడు లేని పేదలందరికీ న్యాయం చేసేలా ఈ పథకాలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకాల వల్ల తొలి రోజే 6 లక్షల 15 వేల 677 మంది అర్హులకు లబ్ధి కలిగినట్లు అయింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ.579 కోట్లు విడుదల చేసింది.

మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4లక్షల41వేల 911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా 6 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించింది ప్రభుత్వం. ఒక్క రోజులోనే మొత్తం 569 కోట్లు రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9 లక్షల 48వేల 333 ఎకరాల భూములకు గానూ.. రైతు భరోసాను చెల్లించింది. జనవరి 26 న బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.

తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం.. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా 6 వేలు రూపాయలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18వేల180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి అకౌంట్లలో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.అలాగే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో.. తొలి రోజే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసి..మొత్తం 72 వేల మంది పేదలకు ఇళ్ల పత్రాలను కూడా అందించింది.

అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులను కూడా జారీ చేసింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజు 531 గ్రామాల్లో 15వేల 414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటితో 51వేల912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించిన ప్రభుత్వం..ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1లక్షా 3వేల 674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.