
కాంగ్రెస్ పార్టీకి కులగణన నివేదిక ఇంటా-బయట కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలు కూడా బహిరంగంగా విమర్శలు చేయడంపై అధిష్టానం సీరియస్ అయింది.పరిధి దాటి ప్రవర్తించిన తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇవ్వడంతో పాటు..టైం బౌండ్ పెట్టి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
తీన్మార్ మల్లన్నకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ వారం రోజుల డెడ్ లైన్ విధించడంతో ..ఇకపై ఎవరూ ఇలాంటిచర్యలకు పాల్పడకుండా హెచ్చరించినట్లు అయింది. కులగణనపై మల్లన్న ఇష్టారీతిన మాట్లాడటం, నివేదికను తగలబెట్టడాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. పార్టీ లైన్ దాటి మాట్లాడటం, కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12లోగా మల్లన్న కమిటీకి రిప్లై ఇవ్వాలని ఆదేశించింది.
దేశంలోనే మొదటిసారి కులగణన చేసిన పార్టీగా తాము రికార్డ్ సృష్టించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారని కాంగ్రెస్ చెబుతుంది. పార్టీ ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి కూడా..పార్టీ నాయకత్వం, ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పింది.
పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్నకు పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే.. ఈ విధంగా ప్రవర్తించడం అస్సలు బాగోలేదని.. పార్టీ గైడ్‌లైన్స్ పాటించకపోవడంతో.. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.
ఇటీవల జరిగిన వరంగల్ సభలో ఒక కులాన్ని దూషిస్తూ చేసిన మల్లన్న వ్యాఖ్యలపై కమిటీకి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా తీన్మార్ మల్లన్నకు తాము షోకాజ్ నోటీసులు ఇచ్చామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి చెప్పారు.మల్లన్న నుంచి వివరణ ఇచ్చాక పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.