రాజకీయ పార్టీలు నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలను విద్యార్థులు, నిరుద్యోగులు నమ్మవద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరమని.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. ‘విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కండి అని పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ.. రెండూ ముఖ్యమేనని సీఎం అభిప్రాయపడ్డారు. చదువుకున్నవారు ప్రయోజకులు అవుతారని, సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేస్తే హీరోలవుతారని చెప్పారు.
ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులతో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని.. ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో విద్యను అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో డ్రాపవుట్‌లను తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇది యువతరంపై ఉన్న అతిపెద్ద బాధ్యత అని అన్నారు.