తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని పీఎం కార్యాలయంలో ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు 20నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో నల్గొండ జిల్లా మరియు తన నియోజకవర్గం సమస్యలను ఆయన ప్రస్తావించారు. భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం నియోజకవర్గ సమస్యలను చర్చించేందుకే కలిశానని స్పష్టం చేశారు.
ప్రధానంగా మూసీ నది కాలుష్యంపై చర్చించానని, నదిలో కాలుష్యం పెరిగిపోయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. గంగానది తరహాలో దీనిని ప్రక్షాళన చేయాలని, అందుకోసం ‘నమామి మూసీ’ కార్యక్రమం నిర్వహించాలని కోరానని తెలిపారు. తన విన్నపంపై స్పందించిన ప్రధాని మోదీ త్వరలోనే మూసీ ప్రక్షాళనపై ఒక కమిటీ వేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు అలాగే నిత్యం ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని కోరానని తెలిపారు. దీనితో పాటు తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించానని వెల్లడించారు. ఇక చివరిగా, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? ఎక్కడినుంచి పోటీ చేయాలి? అనే వివరాలను ఎన్నికలకు నెలముందు ప్రకటిస్తానని కోమటిరెడ్డి చెప్పడం కొసమెరుపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ