తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదిక కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగబోయే మంత్రి వర్గ సమావేశం రాష్ట్ర పరిపాలనా దిశను నిర్ణయించేలా ఉండనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి ఆర్డినెన్సుకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. కేబినెట్‌లో మరో ముఖ్య అంశంగా ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు రాంరెడ్డి దామోదర రెడ్డి పేరు పెట్టే ప్రతిపాదన, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
అలాగే, రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాగునీటి వనరుల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ విధానంతోనే ఎన్నికలకు వెళ్లాలా? లేక కొత్తగా ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లతో పోటీ చేయాలా? అన్నది ఈ సమావేశంలో తేలే అవకాశముంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ వ్యూహం రూపొందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా మరో కొత్త పథకాన్ని కూడా ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
రాష్ట్ర ప్రజల మనసులు గెలుచుకునేందుకు, రాబోయే ఎన్నికల్లో బలమైన స్థానం సంపాదించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక రేపటి కేబినెట్ సమావేశం తెలంగాణ పాలనలో ఒక కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పవచ్చు.