భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం తమ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమురయ్య, అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి. అంజి రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ప్రకటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపిక జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు జరిగినట్లు ఆయన తెలిపారు.
పులి సరోత్తం రెడ్డి (వరంగల్):
వరంగల్‌కు చెందిన పులి సరోత్తం రెడ్డి 21 సంవత్సరాలకుపైగా ఉపాధ్యాయుడిగా మరియు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. 2012-2019 మధ్య కాలంలో పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కీలకంగా పాల్గొని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
కొమురయ్య:
పెద్దపల్లి జిల్లా చెందిన మల్కా కొమురయ్య, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ పూర్తిచేశారు. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో విశేష కృషి చేశారు. హైద్రాబాద్ పల్లవి గ్రూప్‌కి ఛైర్మన్‌గా ఉన్న కొమురయ్య, విద్యాసంస్థల స్థాపన ద్వారా విద్యా విభాగంలో తన ముద్ర వేశారు.
సి. అంజి రెడ్డి:
మెదక్ జిల్లా రామచంద్రపురం చెందిన సి. అంజి రెడ్డి బీఏ మ్యాథ్స్ గ్రాడ్యుయేట్. వ్యాపార రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న ఎస్ఆర్ ట్రస్ట్ గ్రామీణ ప్రజల విద్యాభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉంది.