తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ పోరాటానికి సారాంశంగా రూపొందించిన ఈ విగ్రహం, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగాలకు ప్రతీకగా ఉందని రేవంత్ వివరించారు. ఈ విగ్రహం అభ్యంతరాలకు సంబంధించిన వివాదాలకు సమాధానం ఇస్తూ, ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహ విశేషాలు
17 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ విగ్రహం, బంగారు అంచు ఉన్న పచ్చటి చీరలో తెలంగాణ తల్లిని ప్రతిబింబిస్తుంది. కుడి చేతిలో అభయహస్తం, ఎడమ చేతిలో పంటల ప్రతీకగా మొక్కజొన్న, వరి ఉన్నాయి. విగ్రహ పీఠం కింద గోదావరి, కృష్ణమ్మలను గుర్తుచేసే నీలి రంగు గుర్తులు ఉన్నాయి.
అసెంబ్లీలో రాజకీయ దుమారం
విగ్రహావిష్కరణకు సంబంధించిన అసెంబ్లీలో బిఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన చేశారు. “అదానీ రేవంత్ భాయ్ భాయ్” అనే నినాదాలతో టీషర్టులు ధరించి వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను లోనికి అనుమతించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ స్థానాన్ని మార్చారని ఆరోపిస్తూ సభ వెలుపల నిరసనలు తెలిపారు.
రేవంత్ పిలుపు
డిసెంబర్ 9ను తెలంగాణ ప్రత్యేకత కలిగిన రోజు అని పేర్కొన్న రేవంత్, ఆ రోజు రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్దికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది ఈ రోజును తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
సమావేశాల్లో చట్ట సవరణ బిల్లులు
ఇక అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే, విగ్రహ వివాదం, బిఆర్ఎస్ నేతల నిరసనలతో మొదటి రోజు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు రాజకీయ పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.