తెలంగాణలో మినీ సంగ్రామంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల (2026) ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. 63.79 శాతంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజార్టీ మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో హస్తం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. కౌంటింగ్ మొదలైనప్పటినుండి చివరివరకూ అదే హవా కొనసాగించింది.
కాంగ్రెస్ హవా – క్లీన్ స్వీప్ దిశగా:
నిన్న వెలువడిన పురపోరు ఫలితాల్లో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 74 మున్సిపాలిటీల్లో, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణలోని గ్రామీణ అనుబంధ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ విజయానికి కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మరో 24 స్థానాల్లో హంగ్ నెలకొంది. కాగా, వీటిలో ఎక్కువ స్థానాలను ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
బీఆర్ఎస్, బీజేపీల పరిస్థితి:
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన పట్టున్న కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చిప్పటికీ, ఓవరాల్గా రెండో స్థానానికే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. సుమారు 17 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం చూపింది. కానీ, ఒక్క కార్పొరేషన్నూ ఆ పార్టీ గెలుచుకోలేకపోవడం గమనార్హం.
మరోవైపు, బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లో తన ఉనికిని చాటుకుంటూ కొన్ని డివిజన్లలో గెలుపొందింది. అయితే, రెండు కార్పొరేషన్లలో మాత్రం పాగా వేయగలిగింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ వంటి కార్పొరేషన్లలో త్రిముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల కింగ్ మేకర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది.
పరోక్ష ఎన్నికల కసరత్తు:
ఫలితాల వెల్లడి ముగియకముందే, గెలిచిన వార్డు సభ్యులను కాపాడటం (క్యాంప్ రాజకీయాలు) మరియు స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి. మున్సిపల్ ఛైర్మన్లు మరియు మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలో జరగనున్నందున, ఫిబ్రవరి 16న జరిగే ఎన్నిక అత్యంత కీలకం కానుంది.
మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పీఠాలపై హస్తం పార్టీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
పెరిగిన రేవంత్ పట్టు:
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ బలాన్ని ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల విజయం గాలివాటం కాదని, ప్రజలు తమ పాలనను ఆమోదిస్తున్నారని ఈ ఫలితాలు నిరూపించాయి.
బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఈ విజయంతో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పట్టు పెరగడమే కాకుండా, రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ విజయంతో సీఎం రేవంత్ పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టును మరింతగా పెంచుకున్నారని చెప్పొచ్చు.






































