ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయం- సీఎం కేసీఆర్

Telangana CM KCR Says TSRTC To Be Divided Into Three Types,Mango News,Striking TSRTC employees dare Telangana CM KCR,Government of Telangana Latest News,TSRTC Latest News,TSRTC employees dare KCR to issue sack orders

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రక్షాళన చేసి, భవిష్యత్ లో లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ వుండి తీరాల్సిందేననీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అనీ, తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామనీ సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తం ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదని కూడా ఆయన అన్నారు. క్రమశిక్షణను తుచ తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.

రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశారు. ఆ ప్రతిపాదనలను సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

50% ఆర్టీసీ, 30 శాతం అద్దె బస్సులు, 20% ప్రైవేట్ బస్సులు- మూడు రకాలగా విభజన

ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపాలి. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని వుంచడం కూడా ఆర్టీసీ డిపోలలోనే. మరో 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రయివేటువి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు. ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలో కూడా నడపాలి. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి. వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచడం జరగాలి. స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు అవసరం అని భావించినప్పుడు చేయాలి. ఇప్పటికీ 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఆర్టీసీ యూనియన్ల ప్రవర్తనే కారణం

ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగారు. ప్రభుత్వం ఏది వున్నా వీళ్ళ అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ మానేజ్మెంట్ కు యూనియన్లు ఇవ్వలేదు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. పండగలకు, విద్యార్థుల పరీక్షలకు, ఎవరూ కష్టపడకూడదని ప్రభుత్వ ఉద్దేశం. సమ్మె ఉదృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదు. ఎవరు ఎవర్నీ డిస్మిస్ చేయలేదు. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్ళది “సెల్ఫ్ డిస్మిస్” అయినట్లే. ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తికి వారు స్పందించలేదు. తొలగిపోయినవారు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని డీజీపీని ఆదేశించాను. విధుల్లో వున్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా, సరైన చర్యలు డీజీపీ తీసుకుంటారు అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇకపై యూనియన్లు ఉండవు           

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందినవారు, ఉద్యోగులు, తదితరుల సబ్సిడీ బస్ పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయి. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దానికి కావాల్సిన నిధులు బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే లేదు. యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి, భవిష్యత్ లో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here