తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలతో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యాప్ నిర్వాహకులు, ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
బెట్టింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల వివరాలను అధికారులు గత కొన్ని నెలలుగా సేకరిస్తున్నారు. విచారణలో, ఒక్క ఏడాదిలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇక నేరుగా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న సంస్థలు, వాటి వెబ్‌సైట్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 108 అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయగా, మరో 133 ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు పంపారు.
ఇక, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాధమికంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షల్లో ఆదాయం సమకూర్చుకున్నట్లు పోలీసుల అనుమానం. విజయ్, రానా లాంటి సినీ ప్రముఖులు తమ ప్రమోషన్లు ‘స్కిల్ బేస్డ్ గేమ్స్’ కోసం చేశామని పేర్కొన్నప్పటికీ, పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు.
ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి, తేస్టీ తేజ, కిరణ్ గౌడ్‌లను విచారించగా, శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌లు స్పందించలేదని సమాచారం. ఇక హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్‌లు దర్యాప్తు భయంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పై పూర్తి స్థాయిలో నియంత్రణ కోసం జియో-ఫెన్సింగ్ టెక్నాలజీని TGCSB అమలు చేస్తోంది.