తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో, ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుముల నాయకత్వంలో జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించింది.
సదస్సులో కీలక అంశాలు:
సమగ్ర చర్చలు: రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. శక్తి, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మహిళా వ్యవస్థాపకత ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి ముఖ్య రంగాలపై ఈ చర్చలు జరగనున్నాయి.
దార్శనిక పత్రం: డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ పత్రంలో 2047 నాటికి తెలంగాణను $3-ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఒక సాహసోపేతమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.
లక్ష్యాలు: పెట్టుబడుల ప్రోత్సాహం, సాంకేతిక సహకారం, మరియు ఆవిష్కరణల ఆధారిత వృద్ధిపై దృష్టి సారించి అన్ని రంగాలలో సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను రూపొందించడం ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.
అంతర్జాతీయ, జాతీయ ప్రముఖుల భాగస్వామ్యం:
ప్రముఖ సంస్థలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB), మరియు UNICEF వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
పెద్ద కంపెనీలు: TERI, BCG, మైక్రాన్ ఇండియా, హిటాచి ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కామ్, సాఫ్రాన్, డీఆర్డీఓ, స్కైరూట్, ధ్రువ స్పేస్, అముల్, లారస్ ల్యాబ్స్, జీఎంఆర్, టాటా రియల్టీ, కోటక్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, బ్లాక్‌స్టోన్, డెలాయిట్, స్విగ్గీ, AWS, పివిఆర్ ఐనాక్స్, వంటి ప్రముఖ సంస్థల సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
క్రీడలు: ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్లో క్రీడా ప్రముఖులు పి.వి. సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, మరియు జ్వాలా గుత్తా పాల్గొంటారు.
సినిమా: ‘క్రియేటివ్ సెంచరీ – సాఫ్ట్ పవర్ & ఎంటర్టైన్మెంట్’ చర్చలో సినీ ప్రముఖులు ఎస్.ఎస్. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, మరియు అనుపమ చోప్రా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ ఏర్పాట్లను వ్యక్తిగతంగా పపర్యవేక్షిస్తుండగా.. రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ, సదస్సును ప్రతి సంవత్సరం దావోస్‌లో జరిగే WEF (ప్రపంచ ఆర్థిక వేదిక) స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఈ సదస్సు విజయవంతం అయితే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక సహకారం భారీగా పెరిగే అవకాశం ఉంది.






































