గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) తాజా నివేదిక ప్రకారం, ఆగస్టులో 15,573 మెగావాట్ల డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్ (29,126 మెగావాట్లు), మహారాష్ట్ర (25,855 మెగావాట్లు), గుజరాత్ (21,918 మెగావాట్లు), తమిళనాడు (17,843 మెగావాట్లు) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
డిస్కమ్‌లు ప్రస్తుత విద్యుత్ సరఫరాను నిర్వహించడంలో పెద్దగా ఇబ్బంది పడకపోయినా, రాబోయే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు, ఐటీ సెక్టార్, గృహ, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ 23 శాతం పెరగడం గమనార్హం. సాధారణంగా ఇది ప్రతి సంవత్సరం 12 శాతం మాత్రమే పెరుగుతుంది.
ఈ సంవత్సరం నవంబర్ నెలలో కూడా వాతావరణ మార్పుల కారణంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది గరిష్ట డిమాండ్ 3,756 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది అది 4,352 మెగావాట్లకు పెరిగింది. విద్యుత్ వినియోగం 79 మిలియన్ యూనిట్ల నుంచి 90 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ డిమాండ్‌ను సమర్థంగా తీర్చేందుకు డిస్కమ్‌లు ప్రతి నెలా రూ. 1,000 కోట్లతో నేషనల్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి.
ఈ డిమాండ్‌కు తగ్గట్టు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్జెన్కో) నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో (5×800 మెగావాట్లు) ఉత్పత్తి ప్రారంభం దాదాపు సిద్ధంగా ఉంది. మార్చి నాటికి కొన్ని యూనిట్ల ఉత్పత్తి మొదలవుతుందని అంచనా. అయితే, అంతవరకు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు డిస్కమ్‌లు ఆధారపడాల్సి ఉంటుంది.