ప్రతి మనిషికి సొంతిల్లు అనేది ఒక కల. దీన్ని ఆసరాగా చేసుకొనే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ముంచేస్తున్నాయి. ఫలానా తేదీకల్లా ఫ్లాట్ అప్పగిస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు..ఆ మాట నిలుపు కోవడంలేదు. ఇలాంటి మోసాల బారిన పడ్డ బాధితులు రెరా అంటే.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించి నమోదైన కేసుల విలువ ఇప్పటి వరకూ 20 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే 9 వేల కోట్ల రూపాయల విలువైన కేసులు నమోదయ్యాయి. స్థలం కూడా లేకుండానే ప్రీలాంచింగ్ ఆఫర్ల పేరుతో సాహితీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ రూ.వేల కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలాంటి మోసాల బారినపడ్డ వారికి న్యాయం చేయడానికి రెరా ఏర్పాటయింది. 2017లో రెరాను ఏర్పాటు చేసినా కూడా కేసులను విచారించే అథారిటీ మాత్రం ఏడాది క్రితమే సాకారమైంది. బయట జరిగిన మోసాలతో పోల్చుకుంటే రెరాకు వస్తున్న ఫిర్యాదులు చాలా తక్కువనే చెప్పొచ్చు. దీనికి కారణం రెరా గురించి అవగాహన లేకపోవడం ఒకటయితే.. ఫిర్యాదు చేస్తే నిర్మాణ సంస్థలు ఇంకా మొరాయిస్తాయన్న భయంతో చాలా మంది ఆగిపోతున్నారు. అయితే ఏడాది కాలంగా అథారిటీ వరుసపెట్టి తీర్పులు ఇస్తుండటంతో ఈ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 2,198 ఫిర్యాదులు రాగా 1,263 కేసులను విచారించి తీర్పులు వెలువడ్డాయి.
ఇల్లు కొనుగోలు చేయడానికి డబ్బు చెల్లించినా కూడా.. సహేతుక కారణాలతో దాన్ని కొనుగోలుదారులు వద్దనుకుంటే వడ్డీతో సహా వెనక్కి తీసుకునే హక్కు కొనుగోలుదారుకు ఉంటుంది. కానీ, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ తరహా కేసులు రెరాలో నాలుగోవంతుకు పైనే ఉంటున్నాయి.
ఓ ధరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కాలయాపన చేస్తున్నాయి. ధరలు పెరిగాయి కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించాలని పరోక్షంగా ఒత్తిడి తెస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి.
ఇటు అగ్రిమెంటులో చెప్పిన సదుపాయాలన్నీ తర్వాత సమకూర్చకపోవడం, నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు, పగుళ్లు రావడం వంటివాటిపైన కూడా బాధితులు రెరాకు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్పస్‌ఫండ్, పార్కింగ్ సదుపాయం, సోలార్ ఫెన్సింగ్ వంటివాటిపైన కూడా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మొత్తంగా రెరాపై చాలామందికి పూర్తి అవగాహన రావాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.