ఏపీ,తెలంగాణలో మరో ఎన్నికలకు శంఖారావం మోగింది. తెలంగాణలో మార్చి 31తో ముగియనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది.అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలో మార్చి 31న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా..వాటిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఒకటి, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. మార్చి 3న వీటి ఫలితాలు వెల్లడిస్తామని.. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేస్తామని ఈసీ ప్రకటించింది.
కాగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించి ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. అలాగే నామినేషన్ ఉప సంహరణ కోసం ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో గ్రాడ్యుయేట్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయ్యే గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం జీవన్‌రెడ్డి, కూర రఘోత్తమ్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీలో ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నిలక సంఘం ప్రకటించింది. దీనికోసం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తామని ..ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు ప్రకటిస్తామని ఈసీ వివరించింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.