తెలంగాణ అసెంబ్లీ: రుణమాఫీ, రైతుభరోసా పై కాంగ్రెస్ కి కేటీఆర్ సవాల్..

Telangana Assembly: KTR Challenges Congress on Loan Waiver and Rythu Bharosa

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు సమావేశాలు స్వల్పకాలిక చర్చలతో ప్రారంభమై, రైతు భరోసా పథకంపై విస్తృత చర్చ జరిగింది. రుణమాఫీ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

రుణమాఫీపై కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ రుణమాఫీ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. “రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా,” అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలపై విమర్శలు గుప్పించారు.

డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని రేవంత్ చెప్పినా, వాస్తవంలో ఏ ఊరిలోనూ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదు. కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని ప్రచారం చేసుకుంటున్నారు, అని కేటీఆర్ ఆరోపించారు. అంతేగాక, రూ. 49,500 కోట్లు అవసరమని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో చెప్పినా, అసెంబ్లీ బడ్జెట్‌లో అది రూ.26,000 కోట్లకు తగ్గించడం పై విమర్శలు చేశారు.

రైతు భరోసా పథకంపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మూడుపంటలకు రైతు బంధు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పుడు మాత్రం రైతు బంధుకు కోతలు పెడుతున్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అన్నారు. అలాగే, వానకాలం రైతు బంధు వాయిదా వేయడాన్ని ప్రశ్నించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు పథకాలకో తూట్లు పొడవడం మంచిది కాదు. పథకాలపై కోతలు పెట్టడం ద్వారా రైతులకు నష్టం జరుగుతోంది, అని పేర్కొన్నారు. సభలో వాడివేడి చర్చల మధ్య స్పీకర్, సీఎం రేవంత్ రెడ్డిపై గౌరవం చూపించాలని కేటీఆర్‌కు సూచించారు. దీనిపై స్పందించిన కేటీఆర్, మా నాయకుడు కేసీఆర్‌ను విమర్శిస్తే, మేము కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది. గౌరవం ఇచ్చి గౌరవం పొందుతాం, అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో సాగుతున్న చర్చలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారాయి. రుణమాఫీ, రైతు భరోసా వంటి ముఖ్యమైన అంశాలపై తీసుకునే నిర్ణయాలు, రైతుల జీవితాలకు కీలకమవుతాయని చెప్పవచ్చు.