తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిని వెంటనే తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ కేడర్‌లో మాజీ డీజీపీ అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను రిపోర్ట్ చేయాలని ఆదేశించిన కేంద్రం.. ఈ మేరకు ముగ్గురు అధికారుల్ని తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ చేయాలని చెప్పింది. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అంజనీ కుమార్ గత ప్రభుత్వ హయాంలో డీజీపీగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆయన రోడ్డు సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా బాధ్యతల్లో ఉన్నారు. 1994 బ్యాచ్ అధికారిణి అభిలాష బిస్త్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2011 బ్యాచ్ అధికారి అయిన అభిషేక్ మహంతి ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు.
2014లో ఏపీ విభజన తర్వాత ఈ ముగ్గురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయించారు. అయితే ఈ ముగ్గురూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకొని తెలంగాణలోనే ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా వీరిని ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఎం.ప్రశాంతి ఏపీ కేడర్‌లో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ నుంచి కూడా ముగ్గురు ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ కేడర్‌కు వెళ్లారు.
2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించింది. అయితే ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. తర్వాత డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరకు ఇప్పుడు 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సులతో ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించడంతో ఈ ముగ్గురి అధికారులకు షాక్ ఇచ్చినట్లు అయింది.