తెలంగాణ గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి కీలక తీర్పు వెలువడింది. గ్రూప్ 1 అభ్యర్థులు సవాల్ చేసిన జీవో 29పై సుప్రీంకోర్టు తన నిర్ణయం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం 2022లో విడుదల చేసిన జీవో 55కు సవరణగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీవో 29ను జారీ చేసింది. అయితే, దీనిపై అభ్యర్థులు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాజా విచారణలో, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలకు అడ్డు తొలగినట్లయింది. జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇప్పటికే విడుదల కాగా, త్వరలోనే 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పిలవనున్నారు.
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 – దరఖాస్తు సవరణ ముగిసింది
ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ కోసం 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) 2025 దరఖాస్తు సవరణ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు తమ దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. 13 భాషల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ప్రవేశం లభిస్తుంది. ఎన్‌ఐటీ, ఐఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలల్లో బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష ద్వారా ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 29న జరుగనుంది.
ఏపీఆర్‌డీసీ దరఖాస్తు గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్‌డీసీ సెట్-2025 దరఖాస్తు గడువు పొడిగింపుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. మొదట మార్చి 31తో ముగిసిన గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. ఇక ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.