ఆరో రోజు కొనసాగుతున్న టన్నెల్‌ రెస్క్యూ పనులు..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.SLBC టన్నెల్‌లో ఆరో రోజు కూడా రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కి.మీటర్ వద్ద పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి శనివారం అర్ధరాత్రే.. ఘటన స్థలానికి రక్షణ బృందాలు ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి.

రెస్క్యూ సిబ్బందికి SLBC టన్నెల్‌లో నీటి తోడకం అతి పెద్ద చాలెంజింగ్‌గా మారింది. నిమిషానికి 5వేల లీటర్ల సీపేజ్‌ నీటిని తోడాల్సి రావడంతో పాటు బురద పేరుకుపోతుండడంతో రెస్క్యూ పనులు చాలా క్లిష్టంగా మారాయి. రంగంలోకి ఆర్మీ, నేవీ, NDRF, SDRF, GSI, హైడ్రా, సింగరేణి, ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, BRO, L అండ్‌ Tతోపాటు మరికొన్ని బృందాల రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొన్నాయి. డే వన్ నుంచి సాయశక్తులా ప్రయత్నిస్తున్నా..బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనకు గల కారణాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది.దీనికోసం ఘటనాస్థలానికి నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ బృందం చేరుకుని.. పైకప్పు కూలిన చోట మట్టి, రాళ్లు పరిశీలిస్తున్నారు.

మరోవైపు ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రెస్క్యూ చివరి దశకు చేరిందని చెప్పారు. గల్లంతయిన వారిని క్షేమంగా తీసుకురావడానికి తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.అటు SLBC రెస్క్యూ ఆపరేషన్స్‌ కోసం మరో హెలిప్యాడ్‌ కూడా సిద్దం చేస్తున్నారు. ఓవైపు రెస్క్యూ, మరోవైపు అధికారులు హెలిప్యాడ్‌ ద్వారా రాకపోకలు సాగించనున్నారు. ఇప్పటి వరకూ ఒకటే హెలిప్యాడ్‌ ఉండడంతో రెస్క్యూ పనులు చేయడానికి ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో రెండో హెలిప్యాడ్‌ సాయంతో సహాయచర్యలకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు.