తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు విజయశాంతి. 40 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఓ వెలుగు వెలిగారు. హీరోలను సైతం డామినేట్ చేసే స్థాయికి ఎదిగారు. హీరోయిన్ల పాత్రను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేశారు రాములమ్మ. తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా వినిపించే రాజకీయ నాయకురాలిగా విజయశాంతి పేరు గడించారు. తెలంగాణ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ బిల్లు పాస్ అవ్వడంలో రాములమ్మ ముఖ్యభూమిక పోషించారు. అయితే ఆ తర్వాత నుంచి రాజకీయంగా నిలకడ సాధించలేకపోయారు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో విజయశాంతి సాధించింది ఏమయినా ఉందటే.. ఏమీ లేదు.
1998లో విజయశాంతి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ మహిళా విభాగానికి కార్యదర్శిగా పని చేశారు. బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలో విజయశాంతి పలు సభల్లో చేసిన ప్రసంగాల్లో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బీజేపీకి కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చాయి. అలా ఏడేళ్ల పాటు బీజేపీలో విజయశాంతి కొనసాగారు. ఆ తర్వాత 2005లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కానీ ఎన్నో రోజులు ఆ పార్టీ నిలవలేదు. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌తో చేతులు కలిపారు.
2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఘన విజయం సాధించారు. అయితే కొద్దిరోజులకు విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణలొచ్చాయి. దీంతో 2013లో కేసీఆర్ ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్‌గా ఉండిపోయిన విజయశాంతి.. 2020లో తిరిగి బీజేపీ గూటికి చేరారు. కాషాయపు కండువా కప్పుకున్నారు. మూడేళ్ల పాటు బీజేపీలో విజయశాంతి కొనసాగారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి విజయశాంతి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2023 నవంబర్ 17న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటూ ఇటూ తిరిగి రాములమ్మ కాంగ్రెస్ గూటికి వచ్చినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు అయితే రాలేదు. రాజకీయంగా ఆమె సస్టెయిన్ కాలేకపోతున్నారు. అయితే ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు విజయశాంతికి ఇప్పటి వరకు కూడా ఒక నియోజకవర్గం అంటూ లేదు. అలాగే ఆమెకు బలమైన కేడర్ కూడా లేదు. చివరికి ఏ సామాజికవర్గం అండ కూడా లేదు. అందుకే రాజకీయంగా విజయశాంతి బలహీనురాలయ్యారు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ముందు విజయశాంతి ఆగలు సాగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలానే కొనసాగితే విజయశాంతి రాజకీయ ప్రస్థానం ముగిసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY