తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం పొన్నం చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు భవిష్యత్ తరాలకు తెలియాలన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సర్వాయిపేట కోటను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పాపన్నగౌడ్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తామని, పాపన్న పుట్టిన సర్వాయిపేట, కిలాశపూర్‌లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి 4.70 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
పాపన్న జీవిత చరిత్రకు సంబందించి పాకెట్ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతీ గ్రామానికి పంచి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. సామన్యులనే సైనికులుగా మార్చి కోటలు బద్దలు కొట్టి బయటకి వచ్చి.. ఒక్క భువనగిరి కోటనే కాదు ఏకంగా గోల్కొండ కోటనే కైవసం చేసుకున్న సర్వాయిపాపన్న జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి విద్య కీలమన్న ఆలోచనతో ప్రభుత్వం 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, అలాగే గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రతీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించామన్నారు. సర్వాయి పాపన్న జీవితం మనందరికీ ఆదర్శమన్నారు.