
బీఆర్ఎస్ పార్టీని వదిలి హస్తం గూటికి చేరిన కేశవరావుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక పదవిని కట్టబెట్టింది. అయితే కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఎవరికిస్తారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జోరందుకుంది. ఆ సీటును తెలంగాణ కాంగ్రెస్ నేతలకిస్తారా లేకపోతే సీనియర్లకే కేటాయిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు హైకమాండ్ ఆలోచనేంటి అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన కేశవరావు తాజాగా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఒకపార్టీ నుంచి పదవిని పొంది మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయడమనేది నైతిక బాధ్యత కాబట్టి..కేకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఒక్కరోజులోనే కేకేకు ఆమోదం లభించడమే కాదు.. ప్రభుత్వ సలహాదారునిగా ఆయనను నియమిస్తూ తెలంగాణ గవర్నమెంట్ కీలక పదవిని కట్టబెట్టింది. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేశవరావు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణ వాళ్లకే సీటిస్తారన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ సీటును తెలంగాణలో నేతలకు కాకుండా పార్టీలోని ఓ కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తుంది.
కేకే వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఇప్పటికే సింఘ్వీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగగా..అభిషేక్ సింఘ్వీ ఓటమి పాలయ్యారు. దీంతోనే సింఘ్వీని మరో చోట నుంచి పెద్దల సభకు పంపడానికి కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావును ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగానూ కేకే కొనసాగనున్నారు. అంతేకాకుండా ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇటు కాంగ్రెస్‌లో చేరీ చేరగానే కేశవరావుకు పదవి దక్కడంతో కేకే కంటే ముందు జంపయిన ఎమ్మెల్యేలంతా అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ఎలాంటి పదవులు ఉండబోవని హైకమాండ్ తేల్చిచెప్పి కూడా.. కేశవరావుకి కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇవ్వడంతో ఆయనకొక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా అని తాజాగా కాంగ్రెస్‌లోకి చేరిన నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE