తెలంగాణలో ఇప్పటి వరకూ కూడా ..తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కావాలసినంత క్లారిటీ వచ్చేసింది ఇక రేపో, మాపో కేబినెట్ విస్తరణ ఖాయం అన్న వార్తలు జోరుగా వినిపిస్తాయి.సరే అని రెండు రోజులు ఆగిచూస్తే.. మళ్లీ అదే తంతు. వాయిదాల మీద వాయిదాల ఊసే తప్ప అసలు విషయం ఊసెత్తడం లేదు. దీంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేదానిపై అయోమయం ఏర్పడింది. తాజాగా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్‌తో మరోసారి కేబినెట్ అంశం తెరపైకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందన్న టాపిక్ తెలంగాణలో చర్చనీయాంశం అయింది.
మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ నేతల ఎదురుచూపులు.. పెరిగిపోయిన ఆశావహులు.. ఎదురుచూసీ చూసీ తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ కష్టమేనని వారిలో వారే సమాధానం చెప్పుకొని సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా మంత్రివర్గ విస్తరణపై మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్లు సరికొత్త చర్చకు తెరలేపాయి. కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలోనే ఉందంటూ ఆమె పేర్కొనడంతో హాట్ హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి.
మొన్నటిదాకా కేబినెట్ విస్తరణ అంశం అనేది కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకే మంత్రిపదవి వరిస్తుందని.. ఆ నేతలు ఎవరనేది మాత్రం అధిష్టానమే నిర్ణయిస్తుందని పదేపదే చెప్పారు రేవంత్‌రెడ్డి. దీంతో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం చాలామంది సీనియర్లు అధిష్టానం పెద్దలను కలవడం, లేఖలతో విన్నవించుకోవడం జరిగాయి. అలా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా హైకమాండ్‌కు లేఖ రాసి.. రంగారెడ్డి జిల్లాకు ఛాన్సివ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అయితే ..తనకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేస్తానంటూ పార్టీ పెద్దలకు అల్టిమేటం కూడా జారీ చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారన్న వార్తలు ఇటీవల వినిపించాయి. ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ జరిపినట్లు ప్రచారం నడిచింది. ఇలా చాలామంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు.తాజాగా మీనాక్షి వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి చెబుతుందంతా అబద్ధమా.. కావాలనే అధిష్టానం మీదకు నెట్టేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.