టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మనకు మంచి స్టైలిస్ బ్యాట్స్మెన్ గానే సుపరిచితం. కాని నేటి నుంచి అజయ్ జడేజా నవానగర్ రాజ్యపు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు. జడేజాను గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిగా ప్రకటించారు. జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిని జాం సాహెబ్(మహారాజు) అని పిలుస్తుంటారు. ప్రస్తుత జాం సాహెబ్(మహారాజు)గా శత్రుసల్య సింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా ఉన్నారు. అజయ్ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని శత్రుసల్య వెల్లడించారు.
ఇప్పుడు జామ్‌నగర్‌గా పిలువబడుతున్న నవానగర్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. అప్పట్లో నవానగర్ ప్రత్యేక రాజ్యంగా ఉండేది. జడేజా రాజ్‌పుత్ వంశానికి చెందిన రాజులు ఈ రాజ్యాన్ని పాలించేవారు. ప్రస్తుతం నవానగర్ జామ్‌సాహెబ్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో తన రాజసింహాసనాన్ని తన వారసుడైన అజయ్ జడేజాకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ రాజవంశం సంప్రదాయం ప్రకారం రాజు పదవులు వారసులకు సంక్రమిస్తున్నప్పటికీ పరిపాలన మాత్రం వాళ్ల చేతిలో లేదు.
భారత క్రికెట్లో స్ట్రైలిష్ బ్యాట్స్ మెన్లలో ఒకరు అజయ్ జడేజా. 1992 నుంచి 2000 మధ్య టీమిండియా క్రికెటర్ గా 196 వన్డేలు, 15 టెస్టులు ఆడాడు. 1996 సంవత్సరంలో బెంగుళూరులో జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గొప్ప విజయం సాధించింది. ఆ టైంలో ఇండియా టీమ్ కెప్టెన్ అజయ్ జడేజానే. పాక్‌పై చివర్లో అజయ్ జడేజా 25 బంతుల్లోనే 45 పరుగులు చేశారు. ఫీల్డింగ్‌లో జడేజా మెరుపులు చాలానే ఉన్నాయి.
అజయ్ జడేజా 2000 సంవత్సరంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన అజయ్ జడేజా అయితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత కూడా అతడిని తిరిగి భారత జట్టుకు ఎంపిక చేయలేదు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు. కాగా అజయ్ జడేజా ముత్తాత 1933లో ఇంగ్లండ్ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాడు. క్రికెట్‌లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన కేఎస్ రంజిత్‌సింహ్‌జీ , కేఎస్ దులీప్‌సింహ్‌జీ పేర్లనే పెట్టడం విశేషం.