ఓ ఉద్యోగి తన పెళ్లి కోసం 2 రోజులు సెలవులు అడిగితే మార్కెటింగ్ కంపెనీ CEO తిరస్కరించిన సంఘటన బ్రిటన్ లో జరిగింది. సీఈవో లారెన్ టిక్నర్ లీవ్స్ ఇవ్వను గాక ఇవ్వనని తెగేసి చెప్పారట. అయితే ఆ ఉద్యోగి చేసిన అభ్యర్థనను తిరస్కరించడంతో ఈ అంశం చర్చకు దారితీసింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతున్న వేళ ఆమె పోస్టు సంచలనంగా మారింది. జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వారు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ ఉద్యోగికి సెలవు ఇవ్వకుండా తిరస్కరించిన సీఈవోనే ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఉద్యోగి తన పెళ్లికి సెలవు అడిగితే తాను తిరస్కరించానంటూ టిక్నర్ పెట్టిన పోస్టు పెను కలకలానికి దారి తీసింది. సదరు ఉద్యోగి రెండు రోజుల సెలవు అడిగారని కూడా ఆమె తెలిపింది. అయితే.. సెలవు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో కూడా ధైర్యంగా వివరించింది. ఆమె తెలిపిన దాని ప్రకారం, అంతకుముందే ఈ ఉద్యోగి రెండున్నర వారాల సెలవు తీసుకున్నారు. తన గైర్హాజరీలో ఆ బాధ్యతలు నిర్వహించేందుకు మరో వ్యక్తిని ఎంపిక చేసి తగు తర్ఫీదు ఇవ్వాల్సి ఉండగా అది కూడా చేయలేదని. అప్పటికే ముఖ్యమైన ప్రాజెక్టుల డెడ్‌లైన్స్ సమీపిస్తుండటంతో తాను సెలవు ఇవ్వలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది.
కొత్త ట్రెయినీలను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వడం మేనేజర్ బాధ్యత అని, ఈ బరువు ఉద్యోగి మీద పెట్టడం సబబు కాదని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్ని సెలవులైనా తీసుకోవచ్చని ఓ వైపు అంటూనే మరోవైపు అత్యంత ముఖ్యమైన రోజు కోసం సెలవు లేదంటావా?’’ అని మరో వ్యక్తి నిలదీశాడు.
రెండు రోజుల పాటు భర్తీకి శిక్షణ ఇవ్వాలా? పెళ్లి చేసుకోవాలా? మీ టీమ్ రెండు రోజుల పాటు ఒక వ్యక్తి లేకుండా పని చేయలేకపోతే, మీరు వారి పనులలో సహాయం చేయలేకపోతే లేదా వారికి అప్పగించలేకపోతే, మీరు మీ టీమ్ ని సరిగా నడిపించడం లేదని అర్థం అని మరోకరు కామెంట్ చేశారు.
పెళ్లికి రెండు రోజులు సెలవు తీసుకుంటే ఆ మేరకు మరో వ్యక్తి శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగించాలా? ఒక వ్యక్తి రెండు రోజులు లేకపోతే పని ఆగిపోతుందంటే మేనేజర్‌గా నీ నిర్వహణ సరిగా లేదని స్పష్టమవుతోంది’’ అని మరో వ్యక్తి మండిపడ్డారు.
ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ అయ్యుంటుందని కొందరు సందేహం వెలిబుచ్చారు. జనాలను రెచ్చగొట్టి కామెంట్స్ వరద పారించేలా చేయడమే దీని వెనక లక్ష్యం అయ్యుండొచ్చని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.