తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని కాన్ కంపెనీని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టబడులకు ఫాక్స్ కాన్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సంస్థ పురోగతిపై అక్కడి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలలో పెట్టుబడులకు ఆహ్వానం
ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్న ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. కొంగరకలాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
యాపిల్ ఐఫోన్లు తయారుచేసే సంస్థ ఫాక్స్ కాన్
2023 మార్చిలో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ఫాక్స్ కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఉపకరణాలు తయారు చేసే సంస్థ సంబంధిత కర్మాగారాలను ఏర్పాటు చేసి, ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో రాష్ట్ర ప్రభుత్వంతో అప్పట్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఉద్యోగాలు కల్పించనుంది. యాపిల్ ఐ ఫోన్లను ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తుంది. వీరి ప్రధాన క్లైంట్స్ లో గూగుల్, అమెజాన్, అలీబాబా గ్రూప్, షియోమి, సీస్కో, మైక్రోసాఫ్ట్, నోకియా డెల్, ఫేస్‌బుక్, సోని వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. అమెరికా, యూరప్, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థలున్నాయి. భారత్ విషయానికి వస్తే తెలంగాణ (కొంగర కలాన్), ఏపీ (శ్రీ సిటి), కర్ణాటకలో (బెంగళూరు), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్)లో ఫాక్స్‌కాన్ సంస్థకు కర్మాగారాలు ఉన్నాయి.