అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం, ఏది పడితే అది చేస్తే ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఏ పని చేసినా, ఏం మాట్లాడినా కాస్త ఆలోచించాలి అంటారు పెద్దలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..ఇప్పుడు కక్కలేక మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తి గత దూషణలతో రెచ్చిపోయాడు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాడతారు. దానికి అనుగుణంగా పనిచేస్తారు. అందుకే కూటమి అధికారంలోకి రాగానే..ముఖ్యమంత్రి తర్వాత అంతా పవర్ ఫుల్ పదవి అదే కాబట్టి పవన్ హోం మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ పవన్ ఐదు కీలక మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు.
తన మిత్రుడు, జనసేనలో నెంబర్ 2 గా పేరుబడిన నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖను కట్టబెట్టారు.అయితే దీని వెనుక పవన్ పక్క ప్లాన్ ఉందన్న విషయం ఇప్పటికి కానీ వైసీపీ నేతలకు అర్ధం కాలేదు. నాదెండ్ల సహకారంతో పౌరసరఫరాల శాఖలో ఏం జరుగుతోంది? వైసీపీ పాలనలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడంపై పవన్ దృష్టి పెట్టారు. దీనిపై కావాల్సినంత క్లారిటీ వచ్చాక పవన్ డైరక్టు అటాక్ ఇవ్వడానికి రంగంలోకి దిగారు.
తాజాగా కాకినాడ పోర్టులో విస్తృత తనిఖీలు చేపడుతూ సీజ్ ది షిప్ అన్న పదం ఎంతగా వైరల్ అయిందో అంతగా పవన్ ఉద్దేశం కూడా వైసీపీ నేతలకు అర్దం అయింది. ఎందుకంటే ఇప్పటికీ వైసీపీకి విధేయులైన అధికారులు, ఉద్యోగులు కొంతమంది ఉన్న విషయాన్ని పవన్ దృష్టిలో పడింది. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ విధేయులయిన కొంతమంది అధికారులపై వేటు పడింది. కొంతమంది బదిలీలపై వెళ్లిపోగా..మరి కొంతమంది మాత్రం లాబీయింగ్ చేసుకుని అక్కడే ఉండిపోయారు.
అటువంటి వారే ఇప్పుడు రేషన్ దందాకు సహకరిస్తున్నట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టిక రావడంతో.. ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు.పవన్ డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ తరచూ వెళ్లడానికి కూడా ద్వారంపూడి కారణం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారాలపై పవన్ గట్టిగానే ఆరా తీసినట్లు తాజా పరిస్థితుల వల్ల తెలుస్తోంది.
ఏకకాలంలో ద్వారంపూడి పరిశ్రమలపై దృష్టి పెట్టిన పర్యావరణ శాఖ … నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశ్రమలను మూసివేస్తూ వస్తోంది. ఇప్పటికే రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని కూటమి ప్రభుత్వం మూసేసింది. తాజాగా ద్వారంపూడికి చెందిన వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలను నిర్వహించడమే కాకుండా..అధికారులు పంపిన నోటీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా తాను చేసుకున్న తప్పిదాలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు, జన సైనికులపై దాడులు చేసిన ఉదంతాలూ చాలానే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి వారాహి వేదిక సాక్షిగా శపధం చేశారు.
ద్వారం పూడీ..నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికి తీసి నడి రోడ్డుపై నిలబెట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ ప్రజల ముందు ప్రతిజ్ఞ చేశారు. దీనిపై స్పందించిన ద్వారంపూడి.. ముందు నువ్వు గెలిచి చూడు అంటూ అప్పటికే ఫుల్ తలకెక్కిన గర్వంతో సవాల్ విసిరాడు. అయితే ద్వారంపూడి లెక్కలు తప్పాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ద్వారంపూడి వ్యాపార కోటలు కూల్చివేతలు షురూ అయ్యాయి. ఆరు నెలలుగా పక్కా ఆధారాలు సేకరించి స్కెచ్ వేసిన పవన్.. ద్వారంపూడి అహంకారానికి, అవినీతికి ఒకేసారి చెక్ పెడుతూ వస్తున్నారు.