దేశంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. యాపిల్ ఫండ్ల విక్రయదారుగా ఉంటూ. అదే ముసుగులో అంతర్రాష్ట డ్రగ్స్ రాకెట్ను నడుతుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఈ సంచలన విషయం బయటకువచ్చింది.
అతడి పేరు శశి నేగి. చాలామంది షామీ మహాత్మ అని కూడా పిలుస్తుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా నగరం కేంద్రంగా ఇతడు యాపిల్ పండ్ల వ్యాపారం చేసేవాడు. గత ఆరేళ్లుగా అతడు యాపిల్ పండ్లు అమ్ముతున్నాడు. ఈక్రమంలో అతడికి వాట్సాప్‌లోనూ బిజినెస్ ఆర్డర్లు వస్తుండేవి. అయితే ఆర్డర్స్ యాపిల్స్ కోసం కాదని.. డ్రగ్స్ కోసమని తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వాట్సాప్‌లో డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని.. వెంటనే వాటిని సప్లై చేసేవాడు. వాట్సాప్‌లో ఆర్డర్ పొందిన వెంటనే ఆ డ్రగ్స్ వీడియోను తీసి కొనుగోలుదారుడికి శశినేగి పంపేవాడు. అనంతరం వాటి సప్లై కోసం నలుగురు వేర్వేరు వ్యక్తులను వాడుకునేవాడు. దీనివల్ల యాపిల్ వ్యాపారి తరఫున డ్రగ్స్ సప్లై చేసేవాళ్లకు ఆ సరుకు ఎక్కడికి చేరుతోందనే దానిపై క్లారిటీ రాదు.
ఈ డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్న వారిలో ఒకరితో ఇంకొకరు కాంటాక్ట్ ఉండేవారు కాదు. ఏ ఒక్కరి గురించి మరొకరికి తెలియదు. ఒక్కసారి ఆర్డర్ తీసుకున్నాక నిర్మానుష్య ప్రదేశంలో ఆ డ్రగ్స్ను ఉంచి వీడియో తీసేవారు. ఆ వీడియోను కొనుగోలు దారుకి నిందితుడు పంపేవాడు. అలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులకు, కొనుగోలు దారులకు సంబంధం లేకుండా నడుపుతుండేవాడు. దీంతో చాలా ఏళ్లుగా చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. ఇప్పటివరకు మత్తుపదార్థాలు కొనుగోలు చేసిన ఏ వ్యక్తితోనూ నేగి నేరుగా కలవలేదు. ఇలా వీటి డెలివరీ ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపి తిరిగి తన అకౌంట్లో జమ చేసేలా ప్లాన్ చేసేవాడు. అలా గత 15 నెలల్లో 2.5- 3 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.
వీరికి నైజీరియన్ డ్రగ్స్ ముఠాలతో పాటు హరియాణాలోని ఇతర ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేగి అతని 40 మంది అనుచరులు యాపిల్ వ్యాపార ముసుగులో రోహ్రూ, జుబ్బల్ కోట్బాయ్, థియోగ్ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. బలమైన సోషల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను అనుసరించి ఈ కేసును చేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు 9 మంది అనుచరులపై ఎస్ఐఆర్ నమోదు చేశామని, ముఠాకు చెందిన 25 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.