బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టెస్ట్ బ్యాటర్ల జాబితాలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులతో చెలరేగిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నాడు. డిసెంబర్ 2022 తర్వాత ఇది మొదటి టెస్టు అయినప్పటికీ, రిషబ్ పంత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోవడం ద్వారా భారతదేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యస్సావి జైస్వాల్ ఒక్క స్థానం మెరుగుపరుచుకుని టాప్ 5లో అడుగుపెట్టాడు. 22 ఏళ్ల యువ బ్యాటర్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ సింగిల్ డిజిట్ స్కోరుకే వికెట్లేకుండా పోయాడు. దీంతో ర్యాంకింగ్ లిస్టులో 5 స్థానాలు దిగజారి 10వ ర్యాంక్ లో నిలిచారు. మరోవైపు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి కూడా ఐదు స్థానాలు దిగజారి 12వ ర్యాంక్ లో నిలిచాడు. దీంలో టాప్ టెన్ నుంచి కోహ్లీ నిష్క్రమించాడు.
శుభ్‌మన్ గిల్, ఆర్ అశ్విన్ ముందంజ
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ (113), రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ (119*) ర్యాంకింగ్స్‌లో భారీగా ముందడుగు వేశారు. గిల్ 5 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ అశ్విన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 72వ ర్యాంక్ సాధించాడు. భారత జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ 199 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ప్రస్తుతం 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
అశ్విన్ నెం.1 బౌలర్, జడేజా నెం.1 ఆల్ రౌండర్
టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో 37వ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అరేనాలో అతను 11వ సారి ఈ ఘనత సాధించాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 475 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్ అశ్విన్ 370 రేటింగ్స్‌తో 2వ స్థానంలో నిలిచాడు.