ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక చర్యలు చేపట్టింది. మొత్తం రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు అమలు కానున్నాయి. సోమవారం సచివాలయంలో జరిగిన ఎన్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు అవసరమైన మౌలిక వసతులు తక్షణమే అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
బీపీసీఎల్ రిఫైనరీ: నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ నిర్మాణం. ఇది 2,400 మందికి ఉపాధిని కలిగించడంతో పాటు 20 ఏళ్లలో రూ.88,747 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి అందించనుంది.
టీసీఎస్ విస్తరణ: విశాఖ మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఆజాద్ మొబిలిటీ ప్రాజెక్టు: శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల గ్రీన్ ప్రాజెక్టు కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి.
క్లీన్ ఎనర్జీతో ప్రతిపాదనలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లీన్ ఎనర్జీ పాలసీతో రూ.83 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రిలయన్స్ ప్రాజెక్టులు:
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తోంది. 2028 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు 2.5 లక్షల మందికి ఉపాధిని కల్పించడంతో పాటు రూ.4,095 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి అందించనుంది. ఈ ప్రాజెక్టులన్నీ అమలులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు మరియు యువత ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది.