తిరుపతిలో వారాహి సభలో ప్రసంగించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. సెక్యులరిజం పేరుతో దేశంలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై మండిపడ్డారు. ఇతర మతాలపై ఏవైనా వ్యాఖ్యలు గానీ, దాడులు గానీ జరిగితే.. లౌకికవాదులు, న్యాయస్థానాలు ముందుకు వస్తాయని.. అదే హిందూ మతంపై, సనాతన ధర్మాన్ని కించపరిచినా, దాడులు చేసినా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాంటి వారు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ముందుకు వస్తే మతోన్మాదులుగా చిత్రీకరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని.. ఆ పాపాన్ని పోగొట్టేందుకు తాను ప్రాయిశ్చిత్త దీక్ష చేస్తే దాన్ని అవహేళన చేస్తున్నారని ఆరోపించారు.
ఇవాళ నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు, ధర్మానికి అవమానం జరిగింది.. అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చాను. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది. తిరుమలలో అపచారం జరుగుతోందని.. సరిదిద్దండి అని గతంలోనే తిరుపతికి వచ్చి చెప్పానని.. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో కూడా నేను తిరుపతి వారాహి సభలో చెప్పాను తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండి అని అయినా వైసీపీ వారు వినలేదు. ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు, నేను సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిక్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను’ అని చెప్పారు.
ఇక సభలో పవన్ ‘వారాహి డిక్లరేషన్’ విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
వారాహీ డిక్లరేషన్
1.ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. తక్షణమే అలాంటి చట్టాన్ని తీసుకురావాలి.
3. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి.
4. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5. సనాతన ధర్మాన్ని కించపరిచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగంచే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురాలి.
7. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా… విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.