18 ఏళ్లు నిండిన వారికి ఎంపాక్స్ టీకా ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో తాజాగా అనుమతిని ఇచ్చింది. ఆఫ్రికా ఖండంలో ఎవరూ ఊహించనంత స్థాయిలో విస్తరిస్తున్న ఎంపాక్స్ వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా ఓ టీకాకు అనుమతిని ఇచ్చింది.
ఎంపాక్స్‌పై పోరులో టీకా అనేది కీలక ఘట్టంగా మారనుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. ఎంపాక్స్ టీకాను డెన్మార్క్‌కు చెందిన బేవేరియన్ నార్డిక్ అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని 18ఏళ్లు నిండినవారికి మాత్రమే వేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తూ..శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
యునిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ఎంపాక్స్ టీకాను కొని, పంపిణీ చేయవచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కానీ, ప్రస్తుతం టీకాను ఒకే కంపెనీ ఉత్పత్తి చేస్తుండటంతో..టీకా సరఫరా చాలా తక్కువగా ఉంది. మరోవైపు, మంకీపాక్స్ వ్యాధి పిల్లల్లోనే ఎక్కువగా విస్తరిస్తోన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
కాంగోలో గతవారం నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 70%మంది 18ఏళ్లలోపు వారేనని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆఫ్రికా ఖండంలో గత వారం రోజుల్లోనే ఏకంగా 3,160 ఎంపాక్స్ కేసులు నమోదవగా.. ఈ మంకీ పాక్స్ వైరస్ కారణంగా 107 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.