విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి హెల్త్‌కేర్, మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఎండాడ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మక ఏఐజీ (AIG) హాస్పిటల్స్ మెగా క్యాంపస్ నిర్మాణానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, భూమి పూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
One of India’s premier hospital chains ✅
₹2,000 crore investment ✅
1,000 beds ✅
9,000 jobs ✅Vizag’s emergence as South India’s premier healthcare hub! 🚀🚀@AIGHospitals pic.twitter.com/TDLxnMrMSs
— Lokesh Nara (@naralokesh) August 31, 2026
రూ.2,000 కోట్ల పెట్టుబడి.. 9,000 మందికి ఉపాధి
ఈ ప్రతిష్ఠాత్మక మెగా హెల్త్‌కేర్ ప్రాజెక్టును సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో 1,000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దీనికి సమీపంలోని మరో 2.5 ఎకరాల స్థలంలో ఏఐజీ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వైద్య, నర్సింగ్, సాంకేతిక మరియు అనుబంధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యువతకు నాణ్యమైన ఉద్యోగాలు అందించడంతో పాటు విశాఖపట్నంలో వైద్య రంగానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
రెండు దశల్లో మెగా హాస్పిటల్ నిర్మాణం
ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 650 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టి, 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం రెండో దశలో మరో 350 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తం 1,000 పడకల సామర్థ్యంతో మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు.
ఉత్తరాంధ్రకు ప్రపంచస్థాయి వైద్య సేవలు
అత్యాధునిక వైద్య సాంకేతికత, రోబోటిక్ సర్జరీ, ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా విశాఖపట్నంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’లోనే కీలక వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. విశాఖపట్నాన్ని దేశంలో ప్రముఖ మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





































